పూడి శ్రీహరి కేసు.. నల్లపాడు పోలీసులకు హైకోర్టు సూచనలు
- శ్రీహరి విషయంలో చట్టప్రకారం నడుచుకోవాలన్న హైకోర్టు
- సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూచన
- తదుపరి చర్యలన్నీ చట్టబద్ధంగా ఉండాలని ఆదేశం
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత పోస్టు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, ఆ పార్టీ మీడియా కోఆర్డినేటర్ పూడి శ్రీహరి విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో నమోదైన కేసులపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, పోలీసులకు కీలక ఆదేశాలిచ్చారు. శ్రీహరి విషయంలో చట్టప్రకారం నడుచుకోవాలని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులకు స్పష్టం చేస్తూ, బీఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నేపథ్యంలో, తదుపరి చర్యలన్నీ చట్టబద్ధంగా ఉండాలని కోర్టు ఆదేశించింది.
తనపై నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ శ్రీహరి దాఖలు చేసిన పిటిషన్లపై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏడు ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పటికీ, కుప్పం కేసులో విడుదలైన వెంటనే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు, పిటిషనర్ దర్యాప్తుకు సహకరించడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.